Online Puja Services

నాయనార్ల గాథలు - చండీశ్వర నాయనారు

13.59.82.167

నాయనార్ల గాథలు - చండీశ్వర నాయనారు | Nayanar Stories - Chandeshvara Nayanar
-లక్ష్మీ రమణ


వృక్ష మూలములో నీరు పోస్తే, ఆ వృక్షము పుష్పించి చక్కని ఫలాలనిస్తుంది.  ఈశ్వరునికి చేసే అభిషేకాలు సరిగ్గా వృక్ష మూలానికి పూసే నీరు లాంటివే .  విశ్వ పోషణకి విశ్వమూలమైన లింగానికి మంత్రం పూర్వకమైన అభిషేకాన్ని చేస్తాం.  ఆ అభిషేకానికి మేలుజాతి గోవుల క్షీరాలు శ్రేష్ఠమైనవి.  గోవుల శరీరంలోనే సర్వ దేవతలూ కొలువై ఉంటారు .  అటువంటి గోవులు అనుగ్రహించి వర్షించే క్షీర ధారలతో ఈశ్వరునికి అభిషేకం చేయడం శ్రేష్టమైనది. అందుకే  గో పూజ , గో సంరక్షణ మన తక్షణ కర్తవ్యం  కావాలి. ఈ కర్తవ్యాన్ని అక్షరాలా పాటించి, ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరునిగా పూజలందుకునే భాగ్యాన్ని పొందిన వారు చండీశ్వర నాయనారు. ఈ కథ ఆద్యంతమూ, ప్రతి అక్షరమూ పంచాక్షరిగా  పల్లవిస్తూ ఈశ్వరుని సాక్షాత్కరింపజేస్తుంది. 

క్రౌంచ పర్వతాన్ని సుబ్రహ్మణ్యుడు తన శూలాయుధంతో ఛేదించిన ప్రాంతం తిరుసింగళూరు. చోళరాజుల పరిపాలనలో శైవ సంప్రదాయం వర్ధిల్లిన నేల. అక్కడ నిత్యమూ వేదం ఘోషలు వినిపించే బ్రాహ్మణ అగ్రహారంలో యజ్ఞశర్మ అనే వేదోత్తముడు ఉండేవారు. ఆయనకీ విచారశర్మ అనే పేర పుత్రునిగా ఉదయించారు చండీశ్వర నాయనారు. పూర్వజన్మ పుణ్య ఫలమో , యజ్ఞశర్మ చేసుకున్న పూజల ఫలితమో, ఈశ్వర అనుగ్రహం నిండై ఆ పిల్లవాని రూపంలో యజ్ఞశర్మ ఇంట్లో ప్రభవించింది. విచారశర్మ ఐదేళ్ల చిరుప్రాయంలోనే వేదవేదాంగాలు వంటపట్టించుకున్నాడు. పిల్లవాడు చెప్పినదల్లా  వల్లె వేస్తుంటే,  బిడ్డడు ఏకసంధాగ్రాహి అనుకున్నారు పెద్దలు. 

ఏడవయేట ఉపనయనం చేసి, గురుకులానికి పంపారు.  గురువుగారు పాఠం మొదలు పెట్టడమే ఆలస్యం, ఆ పాఠమంతా కంఠతా చెప్పేసేవారు. గురువులు విచార శర్మ ప్రతిభని చూసి అబ్బురపడ్డారు.  అటువంటి వాడు శిష్యుడైనందుకు సంబరపడ్డారు.  సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపమే ఈ బిడ్డడిగా భూమిమీదికి వచ్చాడని ఆనందపడ్డారు . 

ఒకనాడు గురువుగారి నిత్య యజ్ఞ కర్మకు కావలిసిన సమిధలు తీసుకురావడానికి, విచార శర్మ దగ్గరలోని అడివికి వెళుతున్నారు. దారిలో వారి గోవుల్ని కాచే కాపరి గోవులు మందనుండీ పక్కకి జరిగాయన్న కోపంతో వాటిని కట్టెతో కొడుతున్నాడు .  అది చూసి వేదోత్తముడైన ఆ బ్రాహ్మణుని మనసు తట్టుకోలేకపోయింది. వెంటనే ఆ కాపరిని మందలించాడు . సర్వదేవతా స్వరూపమైన గోవుల్ని కొట్టడం, హింసించడం మహాపాపమని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు .  కానీ ఆ కాపరి అదేమీ తప్పు కాదని, గోవులు మంద నుండీ బయటికి వెళ్లకుండా ఉండేందుకే తానలా చేశాననీ విచారశర్మతో వాదించాడు . 

మూర్ఘులతో వాదించడం అనవసరమని భావించిన విచారశర్మ, గురుకులానికి తిరిగి వచ్చారు.  అక్కడ గురువుగారు, ఇతర బ్రాహ్మణులతో ఇకపై ఆవుల్ని తానే స్వయంగా కాస్తానని, వేరెవ్వరికీ ఆ బాధ్యతని అప్పజెప్పాల్సిన అవసరం లేదని నచ్చజెప్పి, వారి అనుమతిని పొందారు .  ఇక అప్పటి నుండీ వేదమాతలైన గోవుల సంరక్షణా బాధ్యతలని స్వీకరించారు విచారశర్మ.  

గోవుల్ని మంచి పచ్చిక లభించే మైదానాలకి తీసుకువెళ్లి విడిచేవారు. పారే సెలయేళ్ళలోని శుభ్రమైన నీటిని వాటిచేత తాగించేవారు . ప్రకృతిని స్వయంగా ఆ ఈశ్వరీ స్వరూపమేగా ! ఆమెలో నిండిన ఈశ్వరుణ్ణి మనం చూడగలగానే గానీ, అలా గాలికి కదిలే ఆకులో, సూర్యోదయాన విరిసిన  పూవులో , దూకే జలపాతంలోని ప్రతి నీటి బొట్టులో , అనంత సూన్యంలో ప్రభవించిన ప్రతి మబ్బు తునకలో , భువిపైన ప్రతి మట్టి అణువులో ఆమె ఈశ్వరుణ్ణి పట్టి అద్దంలోని ప్రతిబింబంలా మనకి దర్శనం చేయిస్తుంటుంది.  గోవుల్ని మేతకు వదిలిన వేళ  అటువంటి ఈశ్వర దర్శనాన్ని నిత్యమూ పొందుతూ,  సమాధి స్థితిని అనుభవించేవారు విచారశర్మ.  

ఆవులు విచార శర్మ శ్రద్ధ, ప్రేమ వల్ల మంచి పచ్చిక తిని, పుష్టిగా తయారయ్యాయి.  ఇదివరకటి కంటే, రెండురెట్లు ఎక్కువగా పాలివ్వసాగాయి.  ఆ పాలని అగ్రహారమంతా కూడా శివాభిషేకాలకి వినియోగించసాగారు.  విచారశర్మ తాను కూడా నిత్యమూ శివునికి పాలతో అభిషేకం చేయాలి అనుకున్నారు.  ఆవుల్ని మేతకు వదిలాక,  సెలయేటి గట్టున ఇసుకతో లింగాన్ని చేసి, ఆవు పాలతో అభిషేకం చేయడం మొదలుపెట్టారు.  అది ఆయనకీ మరింత సంతృప్తినిచ్చింది.  దాంతో ప్రతిరోజూ అదే విధంగా ఆవుల్ని తీసుకుని అడివికి  వెళ్లడం, సెలయేటి గట్టున శివాభిషేకం చేసుకోవడం , ఇదే ఆయన నిత్యకృత్యం అయిపోయింది. 

అయితే, ఇలా విచారశర్మ నిత్యమూ సైకతలింగాయానికి అభిషేకం చేయడం చూసిన కొంతమంది గిట్టనివాళ్ళు, “విచారశర్మ గోవుల్ని తోలుకువెళ్లి, వాటి పాలన్నీ మట్టిపాలు చేస్తున్నాడ”ని అభియోగం మోపారు. యజ్ఞశర్మమని ఈ విషయంగా నిగ్గు తేల్చడానికి అతన్ని అనుసరించి వెళ్లాల్సిందిగా , తప్పు చేస్తున్నట్టయితే, మందలించాల్సిందిగా కోరారు .  

కొడుకు మీద నమ్మకం ఉన్నప్పటికీ, యజ్ఞశర్మ పండితుల కోరిక మీద  విచారశర్మకి తెలియకుండా, అతన్ని అనుసరిస్తూ వెళ్ళసాగాడు.  విచారశర్మ గోవుల్ని మంచి పచ్చిక బయిలులో విడిచాడు.  అక్కడ పక్కనే ఉన్న నీటి తావు వద్ద కూర్చొని సైకత లింగాన్ని చేసుకొని, ఆవు పాలతో అభిషేకం చేయసాగాడు. నోటినుండీ రుద్రం ప్రవాహమై ఆ రుద్రుని స్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది.  సరిగ్గా అటువంటి సమయంలో యజ్ఞ శర్మ కంటబడ్డాడు విచారశర్మ . దూరం నుండీ ఆయన చేస్తున్న లింగార్చన కనపడడం లేదు.  మట్టి గుట్టలో పాలు పోస్తున్న దృశ్యం గానే తండ్రికి కనిపించింది. 

కొడుకు తప్పు చేస్తున్నాడు అనే ఆలోచన ఆయనకున్న నమ్మకాన్ని తుడిచిపెట్టేసింది.  కోపం కళ్ళకి గంతలు కట్టేసింది.  దాంతో ఆయన వివేకం కోల్పోయారు.  పూర్తిగా తన్మయమై రుద్రాభిషేకం చేస్తూ, ధ్యానమగ్నుడై ఉన్న కొడుకు మీదికి ఒక పెద్ద కట్టే తీసుకుని వెళ్లి వెనుక నుండీ తలమీద గట్టిగా కొట్టాడు. ఆయన శివాభిషేకం చేస్తున్న పాల కుండని కాలితో తన్నేశాడు. ధ్యానమగ్నుడై ఉన్న విచారశర్మకి కేవలం ఆ పాలకుండాని తన్నిన  కాలు కనిపించింది. అంతే. చేతికి అందిన కర్రని ఆ శివాపరాధానికి పాల్పడిన కాలిపైకి విశిరేశారు.  ఆ కర్ర గొడ్డలై ఆ కాళ్ళని నరికేశింది.  యజ్ఞశర్మ అక్కడికక్కడే మరణించాడు. 

శివారాధనలో, శివ ధ్యానంలో మునిగి ఉన్న విచారశర్మకి, ఏంజరిగిందో తెలియనేలేదు.  ఆ కర్రని అలా విసిరేసి, శివాపరాధాన్ని దండించాను , అనుకోని మళ్ళీ అదే  ధ్యానంలో మునిగిపోయారు. ఆ అనన్య భక్తికి ఈశ్వరుడు పరవశించిపోయారు.  పార్వతీమాతతో కూడా కలిసి ఆయనముందు ప్రత్యక్షమయ్యి విచారశర్మని గట్టిగా కౌగలించుకున్నారు. ఆ చిన్నారి మేడలో తన మేడలో ఉన్న రుద్రాక్షమాలని వేశారు. ఆ గాఢమైన రుద్రపరిష్వంగం విచారశర్మని కూడా రుద్రస్వరూపునిగా మార్చేసింది. రుద్ర ముక్తమైన మాల ఆయన్ని చండీశ్వరునిగా చేసింది. 

ఆ సమయంలో ఈశ్వరుడు ఆయనకీ ఎవరికి దక్కని గొప్ప వరాన్ని అనుగ్రహించారు.  “నా పట్ల అపరాధం చేశాడని, నీ తండ్రి కాళ్ళనే నరికేశావు.  ఈ క్షణం నుండీ నేను నీకు తండ్రిని. ఈ విశ్వేశ్వరుని పుత్రునవైన నువ్వు, ఇక నుండీ నా ఆలయాలలో నెలకొని ఉంటావు.  నా నుండీ తీసిన పూల మాలలు, నా వస్త్రాలు, నాకు నివేదించిన పదార్థాలూ నీకే చెందుతాయి. నీ అనుమతితో మాత్రమే వాటిని ఇతరులు స్వీకరించుదురు గాక ! నీ చేత మరణాన్ని పొందిన నీ తండ్రికి కూడా శివ సాయుజ్యాన్ని అనుగ్రహిస్తున్నాను” అని ఆ చిన్నారికి సారూప్యముక్తి ని అనుగ్రహించారు. 

అలా ఇప్పటికీ ప్రతి దేవాలయాల్లోనూ కొలువైన చండీశ్వరనాయనారు మనకి దర్శనమిస్తున్నారు. కేవలమైన భక్తి , అనన్యమైన భక్తి , గోసేవ విచారశర్మని ఈశ్వర పుత్రుణ్ణి చేసింది.  విశ్వనాథుడు సహజంగానే అవాజ్యమైన ప్రేమ కలిగిన తండ్రి స్వభావం కలిగినవాడు.  తండ్రిని ప్రేమగా ఏదడిగినా కాదనకుండా ఎలాగైతే ఇస్తారో, అలాగే ఆ ఈశ్వరుడు కూడా కాస్తంత భక్తితో ఏదడిగినా ఇచ్చేస్తారు.  పైగా తన బిడ్డకి శ్రేష్టమైనది ఇవ్వాలనే తలంపుతో, అడగకుండానే  తండ్రి మరింత అనుగ్రహాన్ని ప్రదర్శించినట్టు, అడగకుండానే ఈశ్వరుడు ఈ మాయా ప్రపంచం నుండీ మనల్ని సునాయాసంగా బయటికి తీసి,  ముక్తిని ప్రసాదిస్తారు.  ఆ విధంగా ఈశ్వరుడు  అనుగ్రహించాలని , ఈ నేలపైన ఈశ్వరార్చనకు సంవృద్ధిగా  గో క్షీరాలు లభ్యంకావాలనీ కోరుతూ … 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు .  శుభం .  

 

 

Nayanar, Stories, Chandeshwara, Chandeeshwara, Chandiswara, Chandeesvara, 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda